రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాట్నా, ఏప్రిల్ 18: జడ్జీల ఎంపిక, నియామకాల ప్రక్రియ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదన్నారు. శనివారం పాట్నా హైకోర్టు శతవార్షికోత్సవాలను ప్రారంభిస్తూ ఆయన ప్రసంగించారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జాక్) స్థాపనపై వివాదం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మన దేశంలో న్యాయవ్యవస్థ అందరికీ అందుబాటులో మాత్రమే కాకుండా వ్యయప్రయాసలు లేని రీతిలో ఉండాలని వ్యాఖ్యానించారు. కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. న్యాయం ఆలస్యం జరిగితే అన్యాయం జరిగినట్లే అని వ్యాఖ్యానించారు.